బీహార్ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం

ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.  ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనిపిలుపిచ్చారు. 
 
అలాగే.. ప్రజలు భౌతిక దూరం  పాటించాలని, మాస్క్ లు వేసుకునే పోలింగ్ కేంద్రానికి రావాలని  ప్రధాని సూచించారు.  కరోనా సమయంలో  భారీ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని  ప్రపంచదేశాలకు బిహార్ ప్రజలు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 
 
మరోవంక, బీహార్‌లో మ‌ళ్లీ ఎన్డీయేను విజ‌యం సాధిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు.  అర‌రియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్‌లో జ‌రిగిన స‌భ‌లో ఇవాళ ఆయ‌న మాట్లాడుతూ  బీహారీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఎన్డీయేకే ప‌ట్టం క‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.  ఇవాళ బీహార్‌లో 94 నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండ‌వ ద‌శ పోలింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.
 
అయితే ఇవాళ జ‌రుగుతున్న పోలింగ్‌లో గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అత్య‌ధిక పోలింగ్ జ‌రిగింద‌ని పేర్కొంటూ ఇది కేవ‌లం దేశానికి మాత్ర‌మే కాదు,  ఇది ప్ర‌పంచానికి సందేశం అని తెలిపారు.  కోవిడ్ వేళ ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  
 
ఇది ప్ర‌జాస్వామ్యంలో ఉన్న శ‌క్తి అని, ప్ర‌తి బీహారీ ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల అంకిత‌భావంతో ఉన్న‌ట్లు మోదీ తెలిపారు. భార‌తీయుల మెద‌ళ్ల‌లో ప్ర‌జాస్వామ్యం ఎలా నాటుకుపోయిందో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మేధావులు విశ్లేషించుకునే సంద‌ర్భం ఇద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 
 
క‌ఠిన‌మైన స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం అద‌న‌పు ఏర్పాటు చేసి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అంటూ ఎన్నికల కమీషన్ ను అభినందించారు.  గ‌త ద‌శాబ్ధ కాలంలో బీహార్‌లో ప్ర‌తి ఇంటికి విద్యుత్తు, గ్యాస్ క‌నెక్ష‌న్లు అందాయ‌ని, 2021 నుంచి 2030 వ‌ర‌కు మ‌రిన్ని అవ‌స‌రాల‌ను తీర్చ‌నున్న‌ట్లు ప్ర‌ధాని ఈ  సందర్భంగా హామీ ఇచ్చారు.    
అవకాశం దొరికిన ప్రతిసారి దేశ ప్రజలు కాంగ్రెస్ ను శిక్షిస్తూనే ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పాలన చేసిన కాంగ్రెస్ పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని ఆయన విమర్శించారు. దేశ ప్రజలు వాస్తవం గ్రహించారని, దీంతోనే దేశంలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందని ఆయన స్పష్టం చేశారు. 
 
పార్లమెంట్ లో ఆ పార్టీకి వంద మంది ఎంపిలు కూడా లేరని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ ను దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు స్వార్ధపరులని, దేశ ప్రజలు సొమ్మును వారు దోచుకతిన్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని, కాంగ్రెస్ తీరును బిహార్ ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు