రిపబ్లిక్ టివి అర్నాబ్ గోస్వామి దౌర్జన్యంగా అరెస్ట్ 

రిపబ్లిక్ టెలివిజన్ ఎడిటర్,మేనేజింగ్ డైరెక్టర్  అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు బుధవారం ఉదయం ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. 2018లో  53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు.

ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను  అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆరోపించింది.

అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని పేర్కొన్నది. ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆర్నాబ్‌ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు.

కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్‌ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా తీసుకెళ్లారని మండిపడ్డారు.

ఛానెల్‌లోని విజువల్స్ ప్రకారం అర్నాబ్‌ను మొదట కారులో ఉంచి, ఆపై వ్యాన్‌లోకి నెట్టారు. అతన్ని వ్యాన్‌లోకి తీసుకెళ్తుండగా, తన ఇంటి లోపల తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆర్నాబ్ మీడియాకు చెప్పారు.

రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు.

అయితే ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయ‌క్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ కేసులో విచార‌ణ తిరిగి మొద‌లుపెట్టిన‌ట్లు ఈ ఏడాది మేలో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచార‌ణ స‌రిగా చేపట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ట్లు అద్యా త‌న ఫిర్యాదులో ఆరోపించింది.

అతనికి  రూ 5.40 కోట్లు చెల్లించలేదని,  ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే నేరారోపణపై ఐపీసీ సెక్షన్ 306, 34ల క్రింద ఆయనపై కేసు నమోదు చేశారు.

కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ అర్న‌బ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. మ‌హారాష్ట్ర‌లో ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి జ‌రిగిన‌ట్లు మండిపడ్డారు.  ప‌త్రికా రంగాన్ని చూడాల్సిన విధానం ఇది కాదని మహారాష్ట్ర ప్రభుత్వంకు హితవు చెప్పారు. ఎమ‌ర్జెన్సీ కాలంలో మదీనాను ఇదే విధంగా చూశార‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో ఆరోపించారు.  

ఇలా ఉండగా, అర్నాబ్ గోస్వామిపై గతంలో రెండు కేసులు నమోదైనాయి. కాంగ్రెస్ తాత్కాలిక  అధ్యక్షురాలు సోనియాగాంధీని కించపర్చారని, పాల్ఘార్ దాడి ఘటన, బాండ్రా స్టేషనులో జనం మోహరించిన ఘటనలపై ముంబై పోలీసు స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదు చేశారు. 

అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని, పరువునష్టం, ఉద్రిక్తతలు రేపేందుకు యత్నించారని అర్నాబ్ పై కేసులున్నాయి. ఈ కేసులపై బాంబే హైకోర్టు ఇచ్చిన స్టేపై మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గోస్వామి, అతని భార్య సమయబ్రతరాయ్ లు కారులో టీవీ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఆగంతకులు దాడి చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.