జాతీయ సమస్యలపై దృష్టి సారించాలి 

దేశం పలు క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో వివిధ జాతీయ సమస్యలను పరిష్కరించడం పట్ల స్వయం సేవకులు దృష్టి సారించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. 

హైదరాబాద్ లో రెండు రోజులపాటు జరిగిన దక్షిణమధ్య క్షేత్రకు సంబంధించిన సమావేశాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ విజయదశమి సందేశంలో తాను ప్రస్తావించినట్లుగా వివిధ రంగాల్లో స్వయంఉపాధి కల్పించడానికి కౌన్సిలింగ్, నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శాఖల విస్తరణతోపాటు కుటుంబ సమ్మేళనాలపై దృష్టి పెట్టాలని కోరారు. వారానికి ఒకసారి నిర్వహించే ఈ సమావేశాల్లో సామాజిక, పర్యావరణ అంశాలపై చర్చ జరపాలని ఆయన సూచించారు.

ఈ సమావేశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు)లు, ప్రాంత కార్యవాహలు(రాష్ట్ర కార్యదర్శులు), ప్రాంత ప్రచారకుల (రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు)తో కూడిన కార్యనిర్వహణ కౌన్సిల్ కు చెందిన 37మంది పదాధికారులు పాల్గొన్నారు.

లాక్ డౌన్ సందర్భంగా సంఘ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల గురించి సమీక్ష జరిపారు. అలాగే రాబోయే రోజుల్లో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ శాఖలు తిరిగి ఎలా ప్రారంభించాలన్న అంశాన్ని కూడా చర్చించారు. 

ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పదాధికారులు పర్యటనలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. 
 
ఆర్ఎస్ఎస్ ప్రతి ఏడాది మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభ, జులైలో  ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు, దీపావళికి ముందు అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాలను జాతీయ స్థాయిలో జరుపుతూ ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ సమావేశాలు జరపలేదు. 
 
ఆర్ఎస్ఎస్ కార్యపద్ధతిలో మొత్తం దేశాన్ని 11 క్షేత్రాలుగా విభజించింది. ప్రస్తుతం క్షేత్రాల వారీగా ఈ సమావేశాలను జరుపుతున్నారు.