మజ్లీస్‌ కనుసైగల్లో టీఆర్‌ఎస్‌ పాలన

టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మజ్లీస్‌ కనుసైగల్లో పాలన చేస్తూ.. వారి మోచేతి నీళ్లు తాగుతున్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి  జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా పటేల్ ‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తూ  తెలంగాణ ప్రజలు సర్దార్‌ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరని స్పష్టం చేశారు.
పటేల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవంను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 15, జనవరి 26 తరహాలోనే సెప్టెంబర్‌ 17ను జాతీయ పండుగలా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులకు లెంపలేసుకొని సెప్టెంబర్‌ను జాతీయ పండగలా నిర్వహించాలని కిషన్ రెడ్డి హితవు చెప్పారు.
నిజాం మరో అడుగుముందుకేసి ఐక్యరాజ్యసమితిలో కూడా విడిగా ఉంటామని దరఖాస్తు చేసుకున్నాడని, రజాకార్లతో తెలంగాణ ప్రజలు, హిందువులపై, మహిళలపై దాడులు చేసి రక్తపాతం సృష్టించారని గుర్తు చేశారు.  సర్దార్‌ ఆనాడు తెలంగాణ ప్రజలకు స్వంతంత్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించారని,  ఏడాది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనమై జాతీయ జెండా ఎగిరిందని వివరించారు.
 పటేల్‌ దేశం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నివాళులు అర్పించారు. నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్ అని చెబూతూ  పటేల్ లేకపోతే తెలంగాణకు స్వంతంత్రం వచ్చేది కాదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని చెబుతున్నా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ధ్వజమెత్తారు.