ఇక సైనిక స్కూళ్లలో ఓబీసీ రిజర్వేషన్

వచ్చే ఏడాది నుంచి సైనిక్ స్కూళ్లలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ వెల్లడించారు. 

‘‘2021-22 విద్యా సంవత్సరం నుంచి సైనిక్ స్కూళ్లలో ఓబీసీ రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది…’’ అని ట్వీట్ లోపేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల తాలూకు కాపీని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. 

ఇప్పటి వరకు 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం సీట్లు ఎస్టీ అభ్యర్థులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను సైన్యంలో పనిచేస్తున్న, రిటైరైన వారి పిల్లల కోసం రిజర్వ్ చేశారు. 

ఇక సైనిక్ స్కూళ్లలోని 67 శాతం స్థానాలను ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానికులకు కేటాయించారు. మిగతా 33 శాతం సీట్లలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన జాబితాలను కేంద్రం లిస్ట్-ఎ, లిస్ట్‌-బి అని పేర్కొంది. 

కేంద్ర రక్షణ శాఖ నేతృత్వంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ నిర్వహణలో నడిచే పాఠశాలలను సైనిక్ స్కూళ్లు అంటారు. విద్యార్థులను భారత సైనిక బలగాల్లో ఆఫీసర్లుగా సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేశారు.