భారత విమాన రంగంలో మొదటిసారి మహిళా సీఈఓ

భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మొదటిసారిగా ఓ మహిళను సీఈఓగా నియమించింది. ఎయిర్ ఇండియా యొక్క ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్‌కు సీఈఓగా హర్‌ప్రీత్ దే సింగ్‌ను నియమించారు. 

ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అలయన్స్ ఎయిర్ సీఈఓగా హర్‌ప్రీత్ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హర్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెను సీఈఓగా నియమించడంతో ఆమె స్థానంలోకి కొత్త ఈడీగా కెప్టెన్ నివేదా భాసిన్‌ను నియమించనున్నాను.

నివేదా భాసిన్ విమానయాన సంస్థ బోయింగ్ 787కు పనిచేస్తున్న అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరు. కెప్టెన్ నివేదా భాసిన్‌కు ఉన్న అనుభవాన్ని బట్టి ఆమెను ఇతర విభాగాలకు కూడా నాయకత్వం వహించాలని కోరారు.

ఎయిర్ ఇండియా ఎంపిక చేసిన మొదటి మహిళా పైలట్‌గా హర్‌ప్రీత్ సింగ్ నిలిచారు. ఆమె 1988లో విమానాయాన రంగంలోకి ప్రవేశించారు. ఆరోగ్య కారణాల వల్ల ఆమె పైలట్‌గా పనిచేయలేదు. కానీ, విమాన భద్రత విషయంలో ఆమె పనిచేశారు. 

ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఈ అసోసియేషన్లో భాసిన్, కెప్టెన్ క్షమాతా బాజ్‌పాయ్ వంటి ఇతర సీనియర్ మహిళా కమాండర్లు కూడా ఉన్నారు.