
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాంరావ్ బాపూ మహారాజ్ శనివారం పరమపదించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రాంరావ్ బాపూ గత కొన్ని రోజులుగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బంజారా కమ్యూనిటీ ప్రజలు రాంరావ్ మహారాజ్‌ను ప్రముఖ సాధువుగా ఆరాధిస్తారు. ఆయనకు దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది అనుచరులు ఉన్నారు. అంతేగాక భారత్‌లోని ప్రముఖ నేతలతో రాంరావ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ తోపాటు బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో రాంరావ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. రాంరావ్ బాపూ మహారాజ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
‘సమాజానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి రాంరావ్ బాపూ మహారాజ్ జీ అందించిన సేవలు అపూర్వం. పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్రజల కష్టాలను తీర్చడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. కొన్ని నెలల కిందటే ఆయనను కలిసే గౌరవం నాకు దక్కింది. ఇది బాధాతప్త సమయం. ఆయన భక్తులతో నా ఆలోచనలు ముడిపడి ఉంటాయి. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రాంరావ్ బాపూకు నివాళులు అర్పించారు. తన జీవితం మొత్తాన్ని పేద ప్రజల అభ్యున్నతికి అంకితం చేసిన మహనీయులు రాంరావ్ బాపూ అంటూ అమిత్ షా చెప్పారు.
అందిన సమాచారం ప్రకారం సోమవారం మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, పౌరాదేవిలో రాంరావ్ బాపూ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు.
More Stories
ధనిక దేశాలు భారత్ కు భారీగా పరిహారం చెల్లించాలి
ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు
భారతీయ నౌకాదళం మరో అరుదైన ఘనత