అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల రద్దు పొడిగింపు

నవంబర్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. 
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్‌ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్‌’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్‌ వంటి 18 దేశాలతో భారత్‌ అంతర్జాతీయ సర్వీస్‌లను నడపడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. 
కాగా, గత వారం ముంబై నుంచి వచ్చిన విమానంలో కొంత మంది ప్రయాణికులకు కోవిడ్‌ ఉన్నట్టు తేలటంతో నవంబర్‌ 10 వరకు ముంబై నుంచి వచ్చే ఎయిర్‌ ఇండియా విమానాలను అనుమతించబోమని హాంకాంగ్‌ ప్రభుత్వాధికారులు తెలిపారు.  ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌తో మాత్రమే భారతీయులు హాంకాంగ్‌కి ప్రయాణిం చవచ్చునని హాకాంగ్‌ ప్రభుత్వం వెల్లడించింది.
భారత్‌  నుంచి విమాన సర్వీసులను హాంగ్‌ కాంగ్‌ రద్దు చేయడం ఇది నాలుగోసారి. ఢిల్లీ-హాంగ్‌ కాంగ్‌ విమాన సర్వీసులను ఆగస్టు 18 నుంచి 31 వరకు, సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 3 వరకు, అక్టోబర్‌ 17 నుంచి 30 వరకు ఆ దేశం రద్దు చేసింది. మరోవైపు పలు ఆంక్షలు కూడా విధించింది. ప్రయాణానికి 72 గంటల ముందుగా పరీక్షలో నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
ప్రయాణికులు హాంగ్‌ కాంగ్‌ చేరిన తర్వాత కూడా మరోసారి కరోనా పరీక్ష చేయించుకోవాలి. భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌, ఇథియోపియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, నేపాల్, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్‌, అమెరికా దేశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని హాంగ్‌ కాంగ్‌ పేర్కొంది.