ముందుకు సాగని గోదావరి ప్రక్షాళన 

‘దక్షిణగంగ’గా పేరొందిన గోదావరి నది ప్రక్షాళన ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. రాజమహేంద్రవరంలోని మురుగు నీటితో పాటు పేపర్‌ మిల్లు, ఇతర పరిశ్రమల నుండి  జీవ, రసాయన  వ్యర్థాలు నేరుగా నదిలో కలిసిపోవడంతో గోదావరి నీరు కాలుష్యమయమవుతోంది.  గోదావరి నది కాలుష్యంపై పర్యావరణ వేత్తలు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. 

1,465 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తున్న గోదావరి చెంతన తూర్పుగోదావరి జిల్లాలో 3,12,812 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉంది. రైతులకు సాగునీటితో పాటు జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇది ప్రధాన వనరుగా ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నదిని కాపాడుకోవడంలో ప్రభుత్వ  యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

జిల్లాలో చెత్త నిల్వలకు డంపింగ్‌ యార్డులు లేక కాలువ గట్లు పూర్తిగా వ్యర్థాలతో నిండిపోతున్నాయి. సామర్లకోట-కాకినాడ కెనాల్‌ పరిధిలో పరిశ్రమల నుంచి రసాయనాలు, ఇతర వ్యర్థాలు నేరుగా నదిలోకి వెళుతున్నాయి. రాజమహేంద్రవరంలోని పేపర్‌మిల్లు, ఇతర పరిశ్రమల వ్యర్థాలు వెంకటనగరం వద్ద నదిలోకి చేరుతున్నాయి.

 రాజమహేంద్రవరం నగర ప్రజలకు గోదావరి నుంచి 74 ఎంఎల్‌డి నీటిని సేకరించి, సరఫరా చేస్తున్నారు. నగరంలోని 50 డివిజన్లలో 618 కిలో మీటర్లు మేర డ్రెయినేజీలు వ్యాపించి ఉన్నాయి. ప్రధానంగా ‘నల్లాఛానల్‌, ఆవఛానల్‌ ద్వారా రోజుకి 60 ఎంఎల్‌డి మురుగు నీరు నదిలోకి నేరుగా కలుస్తోంది.

గోదావరి నదీ జలాల కాలుష్యంపై సెంట్రల్‌ ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌ ఇన్‌ సదరన్‌ ఇండియా(సెస్సీ), ఆర్గనైజేషన్‌ ఎగైనెస్ట్‌ రివర్‌ వాటర్‌ పొల్యూషన్‌ (ఒఆర్‌డబ్ల్యూపి) అనేకమార్లు సర్వేలు నిర్వహించింది. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే వివిధ వనరుల ద్వారా రోజుకు 50 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు నదిలో కలుస్తున్నట్లు అంచనా వేశారు. 

అందులో నగర పాలక సంస్థ పారిశుధ్య విభాగం ద్వారా సేకరించిన 250 టన్నుల చెత్తలో ప్లాస్టిక్‌ ప్రధాన భాగంగా ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రాజమహేంద్రవరం, అమలాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో బయో మెడికల్‌ వ్యర్థాలు కూడా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. 

ఆసుపత్రుల వ్యర్థాలు కూడా గ్రామ శివారులోని గోదావరి నదిలోకే వెళుతున్నాయి. ఇలా ఏళ్లుగా గోదావరి జలాలు కలుషితమవుతున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.