కేసీఆర్ కు దుబ్బాక నుంచే రాజకీయ సమాధి    

నియంత్వత్వ, రజాకార్ల తరహా కేసీఆర్​ పాలనకు దుబ్బాక ఫలితాలు  చరమ గీతం కాబోతోందని, టీఆర్ఎస్​కు అక్కడే రాజకీయ సమాధి పడుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. 2023లో బీజేపీ అధికారానికి దుబ్బాక ఫలితం నాంది పలుకుతుందని భరోసా వ్యక్తం చేశారు.  

టీఆర్ఎస్​ సర్కారు పోలీస్​ కమిషనర్ (సీపీ)​తో తనపై దాడి చేయించిందని సంజయ్​ ఆరోపించారు. ‘‘నన్ను గొంతు పట్టుకుని కారులోకి నెట్టారు. ఆపండి అని అరుస్తున్నా కూడా.. సీపీ పళ్లు కొరుకుతూ నాపట్ల రాక్షసంగా ప్రవర్తించారు. నా కాలు విరిగిపోయేలా ఉందని అరిచినా వినిపించుకోలేదు” అని మండిపడ్డారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీనని కూడా చూడకుండా తనపై పోలీసులు దాడి చేశారని చెబుతూ  దీనిపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. “సీపీ సంగతి, సీఎం సంగతి తేలుస్తా” అని హెచ్చరించారు. తనపై దాడికి పాల్పడిన సీపీపై క్రిమినల్ కేసులు పెట్టి, . సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు

దుబ్బాక ఉపఎన్నిక​లో టీఆర్ఎస్​ ఓటమి భయంతోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఎంతగా అణచేయాలని చూస్తే అంతగా రెచ్చిపోయి పనిచేస్తామని స్పష్టం చేశారు.  బీజేపీ నేతలు, కార్యకర్తల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరును, తమపై జరిగిన దాడిని తప్పుపడుతూ కరీంనగర్​లోని తన కార్యాలయంలో గత రాత్రి నిరాహార దీక్షకు దిగారు. 

బీజేపీ నేత, దుబ్బాక అభ్యర్థి​ రఘునందన్​రావును కలిసేందుకు సిద్దిపేట వెళ్లిన బండి సంజయ్​ను గత రాత్రి పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి కరీంనగర్​కు తరలించారు. అక్కడ సంజయ్​ మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ రావు ఇంట్లో పడుకున్న పసిపాపను కూడా లేపి తనిఖీలు చేశారని, పోలీసులు రాక్షసుల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. 

“మహిళ అని కూడా చూడకుండా రఘునందన్  భార్యను తోసేశారు. సీఎం కేసీఆర్​ ఇంట్లో ఇదే విధంగా చేయగలరా”అని సంజయ్ పోలీసులనునిలదీశారు. తాము స్వాధీనం చేసుకున్న డబ్బును బీజేపీ కార్యకర్తలు ఎత్తుకుపోయారని చెప్తున్నారని.. అలా జరిగితే సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. డబ్బును కాపాడలేని సీపీ ఎందుకని ప్రశ్నించారు. 

దుబ్బాకలో ఎన్నిక​ జరుగుతుంటే సిద్దిపేటలో తనిఖీలు ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా మఫ్టీలో వచ్చి దాడి చేశారని ఆరోపించారు. కేసీఆర్​ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్​ నుంచి దుబ్బాక ఎలక్షన్​కు డబ్బులు వస్తున్నాయని అంటూ  పోలీసులకు దమ్ముంటే కేసీఆర్​ ఫామ్ హౌస్ లో కూడా చెక్ చేయాలని సంజయ్ సవాల్ చేశారు. 

సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆరా తీశారు. ఈ మేరకు సోమవారం రాత్రి బండి సంజయ్​కు ఫోన్​ చేసి మాట్లాడారు. సిద్దిపేటలో పోలీసుల దాడులు, అక్కడికి వెళ్తున్న బండి సంజయ్‌ను బలవంతంగా అరెస్టు చేసి తరలించడం, ఆయనకు గాయాలవడం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.