సరిహద్దుల్లో 300 మంది ఉగ్రవాదులు సిద్ధం

కొత్త ‘జిహాదీ’ ఉగ్రవాదులు సుమారు 300 మంది  భారతదేశంలోకి చొరబడటానికి సరివద్దు వద్ద వేచి ఉన్నారని జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఆర్మీ జవాన్లు వారిని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎటువంటి చొరబాట్లను నియంత్రణ రేఖను ఉల్లంఘించనివ్వమని ఆయన స్పష్టం చేశారు. 

ఇంతకుముందు ఆయుధాలు తీసుకుని ఇప్పుడు వదిలిపెట్టిన వారిని జనజీవన స్రవంతిలో తేవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఆ మార్గంలో వెళ్ళిన యువత తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటే, తాము వారిని ఆహ్వానిస్తాం అనే సందేశాన్ని పంపాలనుకుంటున్నామని చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లో సాధారణ స్థితి తిరిగి వచ్చిందని వెల్లడించారు. 

వాస్తవంగా సరిహద్దులో పెరిగిన నిఘా కారణంగా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) నుంచి చొరబాట్లను పెద్ద ఎత్తున పరిమితం చేసినప్పటికీ.. స్థానిక యువకులను ఉగ్రవాదంలోకి చేర్చుకుంటున్నట్లు ఆర్మీ తెలిపింది.  

గత ఏడాది 130 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని, ఈ సంవత్సరం ఈ సంఖ్య 30 కన్నా తక్కువకు తగ్గించబడిందని బీఎస్‌రాజు తెలిపారు. ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోకి నెట్టడానికి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆరోపించారు, 

నియంత్రణ రేఖ వెంట మొత్తం పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ఆయన చెప్పారు. నియంత్రణ రేఖను దాటిన ఉగ్రవాదులు భారీ సంఖ్యలో లొంగిపోతున్నారని, అయితే తాము దానిని ప్రదర్శించడం లేదని పేర్కొన్నారు . 

జమ్ముకశ్మీర్‌లో ఇబ్బందులను సృష్టించే ప్రయత్నాలను పాకిస్తాన్ వదిలిపెట్టలేదని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఉద్దేశాలలో ఎటువంటి మార్పు లేదని,  అయితే భవిష్యత్‌లో కూడా వారి తప్పుడు చర్యలకు మేం చికిత్స చేస్తామని స్పష్టం చేశారు.