ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో వివిధ మావోయిస్టు గ్రూపులకు చెందిన 32 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా స్థానిక గ్రామాలకు చెందిన వారే. లొంగిపోయిన వారంతా పోలీసులపై దాడులు చేయడం, మందుపాత్రలు పేల్చడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
వారికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందచేసినట్లు వెల్లడించారు. అయితే భద్రతా కారణాలతో వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ మావోయిస్టు సిద్ధాంతాలు పట్టించుకోకుండా ఇష్టానుసారం చేస్తుండడంతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ‘మీ ఇంటికి తిరిగి రండి’ వంటి పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో జనజీవన స్రవంతిలో కలిసిపోవడం మేలని నిర్ణయించుకుని లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందించామని ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
దంతెవాడ జిల్లా పోలీసులు నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లతో మావోయిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్ధాంతాలు లేకుండా హింసను ప్రోత్సహిస్తూ పాల్పడుతూ ఉండడం వల్ల ఎంతో మంది అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయని జనంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వీటి ప్రభావంతో గత జూన్ నుంచి ఇప్పటివరకు 150 మంది వరకు జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్