జవాన్లు  ఒక్క ఇంచు భూమిని కూడా పోనివ్వరు  

ఏదేమైనప్పటికీ, మన జవాన్లు భారత భూభాగం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా బయటకు పోనివ్వరని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు. దేశ సైనికుల ధైర్య, సాహసాలను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. 
 
విజయదశమి సందర్భంగా చైనా సరిహద్దుకు సమీపంలో సిక్కింలో భారత సైనికుల ఆయుధాలకు ఆయుధ పూజల  కార్యక్రమంలో పాల్గొంటూ భారత రక్షణ కోసం ధైర్యవంతులైన చాలా మంది సైనికులు ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. 
చైనా స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త్వ‌ర‌గా స‌మ‌సిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. స‌రిహ‌ద్దుల్లో శాంతి స్థాప‌న జ‌రగాల‌న్న‌దే భార‌త్ అభిమ‌త‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు.   అయితే  అక్కడ కొన్ని అసహ్యకరమైన పరిణామాలు జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.
భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ల‌డాఖ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను చూసిన త‌ర్వాత భార‌తీయ సేన‌లు పోషించిన పాత్ర‌, చూపించిన తెగువ రాబోయే రోజుల్లో చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని అంటూ నివాళులు అర్పించారు.
 
డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మార‌కాన్ని ఆర్మీ ఛీప్ ఎంఎం న‌ర‌వాణేతో క‌లిసి సంద‌ర్శించారు. యుద్ధ స్మారకం వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డున్న ఆయుధాల‌కు ఆయుధ పూజ నిర్వ‌హించారు.