డిసెంబర్ నుండి కొత్త పార్లమెంట్ నిర్మాణం

దేశ ప్రజాస్వామిక అత్యున్నత సౌధం పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లో ఆరంభం అవుతాయి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం 2022 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని లోక్‌సభ సచివాలయ అధికారులు తెలిపారు. 

నిర్మాణ ప్రక్రియలో పార్లమెంట్ సెషన్స్ ప్రస్తుత భవనంలోనే జరిగేందుకు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చేస్తూనే నిర్మాణ పనులు ఉంటాయి. 

నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ దశలో వాయు, శబ్ధ కాలుష్యం తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటారు. నూతన భవనం అందంగా అమరికగా ఉంటుంది. ఎంపిలకు ప్రత్యేక కార్యాలయాలు నెలకొంటాయి. ఇందులో అనేక అధునాతన డిజిటల్ సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వస్తాయి.

పార్లమెంట్ పరిధిలో పూర్తిస్థాయిలో పత్రాల రహిత కార్యాలయాలు ఏర్పాటు చేయాలనేది లక్షంగా పెట్టుకున్నారు. పూర్తిగా కంప్యూటీకరణ, ఎప్పటికప్పుడు నెట్ సంధానంతో దీనికి సరైన రూపకల్పన చేస్తారు. నూతన భవనాన్ని సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడున్న పార్లమెంట్ భవనానికి చేరువలోనే నిర్మిస్తారు. 

భవన నిర్మాణ పనుల సమీక్షకు సంబంధించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన శుక్రవారం జరిగిన విషయాన్ని లోక్‌సభ సచివాలయం తెలిపింది. సంబంధిత కమిటీ భేటీకి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా హాజరయ్యారు.