నాగ్ తుది ప్రయోగం విజయవంతం

రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయి దాటింది. యుద్ధ ట్యాంకుల విధ్యంసక క్షిపణి నాగ్ చివరి దశ ప్రయోగాన్ని భారత్ గురువారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో విజయవంతంగా పూర్తిచేసింది. 
 
పగలు, రాత్రి వేళల్లో నిర్దేశిత లక్ష్యాలను కచ్ఛితత్వంతో ఛేదించగల సామర్ధంగల నాగ్ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) రూపొందించింది. క్షిపణి ప్రయోగానికి ముందే లక్ష్యాన్ని గుర్తించడం దీని ప్రత్యేకత.
నాగ్ క్షిపణి క్యారియర్ నమిక నుంచి నిర్దేశిత లక్ష్యాన్ని ప్రయోగించినట్లు రక్షణ రంగ అధికారి ఒకరు తెలిపారు. 
 
చివరి దశ ప్రయోగం విజయవంతం కావడంతో ఈ క్షిపణి ఇక తయారీ దశకు చేరుకుందని. క్షిపణిని ప్రభుత్వ రంగంలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బిడిఎల్) తయారు చేస్తుందని, క్షిపణి క్యారియర్ నమికను మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేస్తుందని డిఆర్‌డిఓ తెలిపింది. 
 
నాగ్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తిచేసినందుకు డిఆర్‌డిఓను, భారత సైన్యాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.