
మారటోరియం కాలంలో నెలవారీ వాయిదాల (ఈఎంఐ) వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ) చెల్లింపునకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈ చెల్లింపు గురించి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వెల్లడించనున్నది. అయితే ఈఎంఐలపై బ్యాంకులు విధించే సాధారణ వడ్డీ, మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తున్నది.
కరోనా నేపథ్యంలో లౌక్‌డౌన్ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరు నెలలపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు అమలులో ఉన్న ఈ మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నవారు వడ్డీపై వడ్డీ (చక్ర వడ్డీ) చెల్లించాలని అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలో కొందరు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వడ్డీపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని, దీనిని మాఫీ చేయాలని కోరారు. చివరకు కేంద్రం దీనికి అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న ఈఎంఐలపై అదనపు వడ్డీ భారాన్ని తామే భరిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పింది.
అయితే దీని అమలుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఒక నెల గడువు కోరింది. గత విచారణ సందర్భంగా న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ ఎస్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. సాధారణ ప్రజల ప్రయోజనం కోసం దీనిని త్వరగా అమలు చేయాలని పేర్కొంది.
ప్రజల దీపావళి పండుగ సంతోషం ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నదంటూ జస్టిస్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో వడ్డీపై వడ్డీ మాఫీని దీపావళిలోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించడంతోపాటు అదనపు వడ్డీ భారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మారటోరియం కేసు తదుపరి విచారణలో సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించనున్నది.
More Stories
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో రణ్బీర్ కపూర్కు ఈడీ సమన్లు
న్యూస్క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
భారత్ లో క్రమంగా పెరుగుతున్న 5జి ఫోన్ల వినియోగం