కలుషితమైన గాలిలోని అధిక పరమాణు పదార్థాలు దేశంలో 1,16,000 మంది నవజాత శిశువుల మరణాలకు కారణమయ్యాయని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది. వారిలో ఏ ఒక్కరు కూడా నెల రోజులకు మించి బతుకలేదని తెలిపింది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 (SoGA 2020) పేరుతో ఈ ప్రపంచస్థాయి అధ్యయనం చేశారు.
ఆ మరణాల్లో సగం మందికిపైగా పసిబిడ్దల మృతికి బహిరంగ ప్రదేశాల్లోని పీఎం 2.5 కారణమని, ఇతరులు బొగ్గు, కట్టెలు, పశువుల పేడ లాంటి ఘన ఇంధనాలను వంట కోసం ఉపయోగించడం ద్వారా వెలువడే కాలుష్యంవల్ల చనిపోయారని ఈ అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంపాటు బహిరంగ, గృహ వాయు కాలుష్యానికి గురి కావడంవల్ల 2019లో మొత్తం 1.67 లక్షల మంది ప్రాణాలు కో్ల్పోయారని తాజా అధ్యయనం తెలిపింది.
వారంతా బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, డయాబెటిస్, లంగ్ క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, పుట్టుక సంబంధ వ్యాధుల బారినపడి చనిపోయారని పేర్కొన్నది. శిశువుల మరణాల్లో చాలావరకు నెలలు నిండక ముందు జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం లాంటి కారణాలతో సంభవిస్తున్నాయని SoGA 2020 అధ్యయన నివేదిక స్పష్టం చేస్తున్నది.
ఇతరుల్లో మరణాలకు ప్రస్తుతం వాయు కాలుష్యమే అతిపెద్ద కారణంగా మారిందని తెలిపింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ బుధవారం ఈ నివేదికను ప్రచురించింది. తాజా అధ్యయనానికి యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీతోపాటు ఇతరులు నిధులను సమకూర్చారు.
వాయు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ బాధితులు మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో బాధపడే వారిలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. దేశంలో కరోనా ప్రభావంవల్ల ఇప్పటికే 1,10,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నది.
వాయు కాలుష్యం, కరోనా ఇన్‌ఫెక్షన్‌కు మధ్య సంబంధం పూర్తిగా స్పష్టం కానప్పటికీ.. వాయు కాలుష్యానికి, గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు పెరుగడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అధ్యయనం స్పష్టంచేసింది.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు