సైబర్ నేరాలలో రూ.1.25 లక్షల కోట్ల నష్టం

దేశంలో సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేరాల కారణంగా గత ఏడాది 2019లో దేశంలో రూ1.25 లక్షల కోట్ల నష్టం జరిగిన్నట్లు జాతీయ సైబర్ భద్రతా కో ఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్‌ రాజేష్ పంత్ తెలిపారు. దేశం స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయడం, 5జీ నెట్‌వర్క్‌ ప్రారంభంతో సైబర్‌ బెదిరింపులు పెరుగుతాయని పేర్కొన్నారు.

సైబర్‌ భద్రత ఉత్పత్తులను తయారుచేసే భారతీయ కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయని, ఈ రంగంలో పెద్ద శూన్యత ఉందని ఆయన చెప్పారు. సైబర్ దాడులను అరికట్టడానికి నమ్మకమైన స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక ఫోరంను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.

గతేడాది మన అధికారిక గణాంకాలు భారత్‌లో సైబర్‌ నేరాల కారణంగా నష్టపోయిన రూ.1.25లక్షల కోట్లని చెబుతూ రాన్సమ్‌వేర్‌ దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ఈ నేరగాళ్లు ఇంటి నుంచే పని చేస్తున్నారని, వారికి ఎలాంటి మానవత్వం ఉండదని హెచ్చరించారు. హాస్పిటళ్లపై కూడా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌లో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వారికి తెలుసని, అందుకే దవాఖానపై కూడా దాడి చేస్తున్నారని పరిశ్రమల సంస్థ ఫిక్కీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు.  ప్రజలు వినియోగించే మొబైల్‌ ఫోన్లలో చాలా బలహీనతలున్నాయని డా. రాజేష్  పంత్ హెచ్చరించారు.

మొబైల్‌ ఫోన్‌లో వెక్టర్‌పై దాడి వెక్టర్‌పై విశ్లేషణ చేశామని, ఒక మొబైల్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేయగల 15 వెక్టర్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లు, కమ్యూనికేషన్ ఇంటర్ ఫేస్‌లు, బ్లూటూత్ అలాగే వై-ఫై ఉన్నాయని చెప్పారు.