దక్షిణ కశ్మీరులో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీరులో రెండు రోజుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
మంగళవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల పోరు మొదలైనట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో సోమవారం మొదలైన కాల్పుల పోరు మంగళవారం ఉదయం వరకు కొనసాగగా ఇందులో ఒక ఉగ్రవాది మరణించాడు.
సంఘటన స్థలం నుంచి ఒక ఎకె రైఫిల్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైనపోరాలోని మెల్హుర వద్ద ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం భద్రతా దళాలు గాలింపు చేపట్టగా వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక ఉగ్రవాది మరణించినట్లు పోలీసులు చెప్పారు. మరణించిన ఉగ్రవాది వివరాలు ఇంకా తెలియరావలసి ఉందని వారు తెలిపారు.