యువత, ఆరోగ్యవంతులకు 2022లోనే వ్యాక్సిన్ 

యువత, ఆరోగ్యవంతులకు 2022లోనే వ్యాక్సిన్ 

ఆరోగ్యవంతులు, యువ‌త‌ కరోనా వ్యాక్సిన్ కోసం 2022 వ‌ర‌కు క‌రోనా  వేచి చూడాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.  వైర‌స్ వ‌ల్ల రిస్క్‌లో ఉన్న హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు ముందుగా టీకా అందుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. 

ప్ర‌స్తుతానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు రకాల క‌రోనా టీకా ట్ర‌య‌ల్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, ముందుగా ఎవ‌రికి టీకా ఇవ్వాల‌న్న అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు ఆమె తెలిపారు.  హెల్త్ వ‌ర్క‌ర్లు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ముందు క‌రోనా టీకా ఇవ్వాల‌ని చాలా మంది అంగీక‌రిస్తున్నట్లు చెప్పారు. 

క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అనేక మార్గ‌ద‌ర్శ‌కాలు రానున్నాయ‌ని, కానీ ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తులు వ్యాక్సిన కోసం 2022 వ‌ర‌కు వేచి చూడాల్సి ఉంటుంద‌ని ఆమె తెలిపారు.  2021 వ‌ర‌కు క‌నీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వ‌స్తుంద‌ని ఆమె పేర్కొన్నారు. 

కానీ ఆ టీకా చాలా త‌క్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందని ఆమె చెప్పారు. వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య ప‌ట్ల నిర్లక్ష్యం వ‌ద్ద‌ని ఆమె హితవు చెప్పారు. పెరుగుతున్న కేసుల సంఖ్య వ‌ల్ల మ‌ర‌ణాల రేటు కూడా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆమె హెచ్చరించారు.  మ‌ర‌ణాల శాతం త‌గ్గింద‌న్న భావ‌న‌తో నిర్ల‌క్ష్యంగా ఉండ‌రాద‌ని చెప్పారు.