టీటీడీ బోర్డు చైర్మన్‌ సుబ్బారెడ్డికి కరోనా

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి కరోనా వైరస్‌ సోకింది. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆయన దూరంగా ఉండనున్నారు. 

ఇటీవల ఆయనకు కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో గురువారం ఉదయమే హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం.

14 రోజులపాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉన్నందున గురువారం ప్రారంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. టీటీడీ పాలకమండలి ఉండగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చైర్మన్‌ పాల్గొనలేకపోవడం దేవస్థానాల చరిత్రలో ఇదే ప్రధమం కానున్నది. 

కాగా, ఏపీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,767 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,038 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,71,503కి పెరిగింది. 

తాజాగా తూర్పుగోదావరిలో 548, చిత్తూరులో 489 కేసులు వెలుగులోకొచ్చాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 5,622 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 7.25 లక్షలకు చేరింది. ఇక కరోనాతో మరో 38 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,357కి పెరిగింది.