
బీజేపీ కార్యకర్తలపై కరోనా వైరస్ కలిపిన నీళ్ళను పశ్చిమ బెంగాల్ పోలీసులు జల్లారని ఆ పార్టీ ఎంపీ సౌమిత్ర ఖాన్ ఆరోపించారు. ‘నబన్న చలో’ నిరసనలో పాల్గొన్నవారిపై కరోనా వైరస్ కలిసిన రంగు నీళ్ళను జల్లారని, బీజేపీ కేడర్‌ను అంతం చేయడానికే ఇలా చేశారని పేర్కొన్నారు.
తాము మరణించినా పోరాడతామని స్పష్టం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తర్వాత బీజేపీ కార్యకర్త రాజు బెనర్జీకి కోవిడ్-19 సోకిందని చెప్పారు. ఈ వైరస్‌ను వ్యాప్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరి ప్రమేయం ఉందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో అధికరణ 356ను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సిండికేట్ పాలన అంతం కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) గత గురువారం ‘నబన్న చలో’ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
సచివాలయం వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనన్లతో నీళ్ళు జల్లారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి.
More Stories
రాజద్రోహం సెక్షన్ కొనసాగాల్సిందే.. శిక్ష కూడా పెరగాలి
ఉన్నత స్థితికి భారత్ నేపాల్ సంబంధాలు
మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు, డిజిపిపై వేటు