రాష్ట్రాలకు రూ. 12వేల కోట్ల 50 ఏళ్ల వడ్డీ లేని రుణం 

కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థికవ్యవస్థకు ఊతం అందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. మూలధన వ్యయ ప్రాజెక్టుల కింద రాష్ట్రప్రభుత్వాలకు రూ. 12వేల కోట్లను 50 ఏళ్ల వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
 
ఈ మొత్తంలో రూ.1600కోట్లను ఈశాన్యరాష్ట్రాలకు, రూ.900 కోట్లను ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన రూ. 7500 కోట్లను మిగిలిన రాష్ట్రాలకు అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన సంస్కరణలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలకు రూ.2000వేల కోట్లు ఇవ్వబడుతుందని చెప్పారు. 
 
ఈ రుణం కొత్త లేదా కొనసాగుతున్న మూలధన ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి వుంటుందని చెప్పారు. ఈ మొత్తాన్ని 2021 మార్చి 31లోపు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే అదనపు మూలధన వ్యయం కింద  మరో రూ. 25 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఇది బడ్టెట్‌లో రూ. 4.13 లక్షల కోట్ల అదనపు భారంగా ఉంటుందని, ఈ నగదును రోడ్లు, రక్షణ మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, పట్టణాభివృద్ధికి ఖర్చు చేయడానికి  వినియోగించాలని ఆమె చెప్పారు.