సగంకుపైగా తగ్గిన ఏపీ ఆదాయం 

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సగంకు పైగా ఆదాయం తగ్గడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలి వస్తున్నది. రావాల్సిన ఆదాయం కన్నా 32 శాతం తక్కువగా రావడంతో దైనందిక కార్యకలాపాలను కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. 
 
సొంత పన్నుల ఆదాయం ద్వారా రూ.70,679 కోట్లు రావాల్సి ఉండగా, సెప్టెంబర్‌ చివరినాటికి రూ.35 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేశారు. రూ.14,962 కోట్లే ఆదాయం లభించింది. ఇది మొత్తం ఆదాయంలో దాదాపు 42 శాతంగానే ఉంది. ఇదే గత ఏడాదితో పోల్చి చూస్తే 32 శాతం వరకు తగ్గుదల కనిపించింది.
 
గతేడాది సెప్టెంబర్‌ వరకు రూ.21,967 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు రూ.12,961 కోట్లు మాత్రమే వచ్చింది. ఇరదులో జిఎస్‌టి పరిహారంగా రూ.8850 కోట్లు రాగా, పెట్రోల్‌ ఉత్పత్తులపై రూ.4509 కోట్లు, లిక్కర్‌పై రూ.1530 కోట్లు, వృత్తి పన్ను ద్వారా రూ.72 కోట్లు చేతికందాయి. 
 
గతేడాదితో పోల్చిచూస్తే జిఎస్‌టిలో 18.88 శాతం, పెట్రో ఉత్పత్తులపై 13.54 శాతం, మద్యంపై 73.32 శాతం, వృత్తి పన్నుపై 32.11 శాతం తక్కువ ఆదాయం రికార్డయింది. ప్రతి నెలా అన్ని విభాగాల్లో ఆదాయం మైనస్‌లోనే ఉండగా, జులై-సెప్టెంబర్‌ నెలల్లో పెట్రోలియం ఆదాయం 3.76 శాతం పెరుగుదల కనిపించడం గమనార్హం. 
 
లీటర్‌పై రెండు రూపాయల వరకు పెంచడం వల్లే ఆదాయం కూడా పెరిగినట్లు కనిపిస్తోంది.  మద్యం విషయానికి వస్తే 70 శాతం వరకు ఆదాయం తగ్గినట్లు వాణిజ్య పన్నుల శాఖ చెబుతున్నప్పటికీ, ఆర్థికశాఖ లెక్కల మేరకు గత ఏడాదితో సమానంగానే ఆదాయం వచ్చినట్లు తెలుస్తున్నది.