
ములుగు జిల్లాలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వరరావును దారుణంగా చంపేశారు. వెంకటాపురం మండలం నూగూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 మంది మావోయిస్టులు భీమేశ్వరరావు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే దారుణంగా కొట్టి చంపేశారు.
అత్యవసరంగా డబ్బులు కావాలి… ఆస్పత్రికి వెళ్లాలి అంటూ… ఆయన్ని బయటకు రమ్మన్నారు. ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బులు లేవన్న భీమేశ్వర్… డోర్ తియ్యలేదు. దాంతో మావోయిస్టులు డోర్‌పై కాల్పులు జరిపి… భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. నిద్రమత్తులోనే ఆయన బయటకు వచ్చారు.
ఆ తర్వాత మావోయిస్టులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచారు. తనను చంపొద్దని మీరు ఏం చెబితే అది చేస్తానని భీమేశ్వర్ వేడుకున్నా మావోయిస్టులు ఆగలేదు. ప్రాణాలు తీసేశారు. ఈ హత్య ఎవరు చేశారో అని పోలీసులు దర్యాప్తులు చేయాల్సిన అవసరం లేదంటూ, తామే హత్య చేసినట్లుగా నిరూపించేందుకు ఘటనా స్థలంలో ఓ లేఖను వదిలి వెళ్లారు.
ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ లేఖలో మావోయిస్టులు టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్లు చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రజలను దోచుకుంటున్నారని లేఖలో ఫైర్ అయ్యారు. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఐదు రోజుల క్రితమే వెంకటాపురంలో డీజీపీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పర్యటించారు. మావోల సంచారంపై పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. డీజీపీ పర్యటించిన ప్రాంతంలో మావోలు ఈ చర్యకు పాల్పడటాన్ని గమనిస్తే పోలీసులకు సవాల్ విసిరినట్లుగానే కనిపిస్తోంది.
More Stories
డిస్కంలను కేసీఆర్ నిండా ముంచిండు
కరోనా ఔషధం, వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ది కీలక పాత్ర
ప్రవాసి భీమా లేకుండా విమానం ఎక్కొద్దు