డిసెంబర్‌లో జిహెచ్‌ఎంసి ఎన్నికలు !  

డిసెంబర్‌లో జిహెచ్‌ఎంసి ఎన్నికలు !  

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. డిసెంబర్‌లో జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. 

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఆ తరువాత బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ మెజార్టీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు పార్థసారధి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు పనుల్లో సిబ్బంది నిమగ్నమైనట్లు తెలిపారు.

ఫిబ్రవరి మొదటి వారంలో జిహెచ్‌ఎంసి పాలకవర్గ గడువు ముగియనుండటం వల్ల ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కమిషన్ సిద్ధంగా ఉందని, సమయానుసారం త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.

కాగా, ఉన్నతస్థాయి వర్గాలు తెలిపిన ప్రకారం డిసెంబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ నెలలో నోటిఫికేషన్ ప్రకటించనున్నట్లు తెలిసింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. 

ఈ సందర్భంగా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగి, ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తే ప్రజలు రెండేళ్ల పాలనపై సంతృప్తిపరంగా ఉన్నారని బ్యాలెట్‌తో నిరూపించి, మరోమారు విపక్షాలకు నోరు మెదిపే అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.

ఇప్పటికే ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కూడా నవంబర్ రెండోవారం తరువాత ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. 

మరోవంక, కరోనా సాకుతో బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఎస్‌ఇసి నిర్ణయించింది. అందులో భాగంగా ఆంధప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల కోసం పంపిన బ్యాలెట్ బాక్సులను వెనక్కి తెప్పించుకుంటోంది.