సిబిఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య 

సీబీఐ మాజీ డైరెక్టర్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని తన  ఇంట్లో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వనీకుమార్ వయసు 69 ఏళ్ళు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.  

అశ్వనీ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని షిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా మీడియాకు వెల్లడించారు. ఆయన ఇంగ్లిష్​లో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ ఆయన రాసిందేనని కుటుంబ సభ్యులు ధృవీకరించారని చెప్పారు. 

జీవితంలో ఇక చేయాల్సిందేమీ లేదన్నంతగా ఆయన డిప్రెషన్ లో ఉన్నారని, అందుకే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లుగా అందులో రాశారని తెలిసింది.  

అశ్వనీ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ రాష్ట్ర డీజీపీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్​గా నియమితులయ్యారు. నాగాలాండ్, మణిపూర్​లకు గవర్నర్ గా పనిచేశారు.