వివాదాస్ప‌ద ప్రాంతంలో ప్ర‌తి ఒక్క దేశానికి హక్కు 

వివాదాస్ప‌ద ప్రాంతంలో ప్ర‌తి ఒక్క దేశానికి భ‌ద్ర‌తా ప‌రంగా, ఆర్థిక‌ప‌రంగా స‌మ‌మైన హ‌క్కులు ఉన్న‌ట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ స్పష్టం చేశారు.  జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌రిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొంటూ వివాదాల ప‌ట్ల శాంతియుత ప‌రిష్కారాన్ని కోరుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

దేశీ భూభాగ స‌మ‌గ్ర‌త‌ను, సార్వ‌భౌమ‌త్వాన్ని గౌర‌విస్తామ‌ని చెప్పారు.  భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో విదేశాంగ మంత్రి జైశంక‌ర్ చేసిన ఈ ప్ర‌క‌ట‌నకు ప్రాధాన‌త్య సంత‌రించుకున్న‌ది.

భార‌త్‌, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, అమెరికా దేశాలు క్వాడ్ గ్రూపులో  స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో దేశాల‌న్నీ అంత‌ర్జాతీయ ఆదేశాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు.  అంత‌ర్జాతీయ జ‌లాల్లో స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా తిరిగే వీలుండాల‌ని జైశంకర్ తేల్చి చెప్పారు.

ఇండో ప‌సిఫిక్ కాన్సెప్ట్‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని కూడా ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేస్తూ ఆసియాన్‌తో పాటు జ‌ర్మ‌నీ కూడా ఇండో ప‌సిఫిక్ సిద్ధాంతాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

క్వాడ్‌లోని స‌భ్య దేశాల‌తో చైనా ఏదో ఒక పేచీ పెట్టుకున్న‌ది. అంతేకాదు, ద‌క్షిణ చైనా స‌ముద్రంలో 90 శాతం త‌మదే అని కూడా చైనా ఆరోపిస్తున్న‌ది. దీంతో ఆసియా దేశాల్లో చైనాపై ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింది.  ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ చైనా స‌ముద్రం ప్రాంతంలో స్వేచ్ఛ‌గా నావిగేష‌న్ చేసేందుకు వీలు క‌ల్పించాల‌ని అనేక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.