ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దె దించేందుకు భారీ ర్యాలీలు

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు ఆ దేశంలోని ప్రతిపక్షాలు భారీ వ్యూహం రచించాయి. 11 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి, భారీ ఉద్యమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గుజ్రన్‌వాలాలో ఈ నెల 16న భారీ సభ నిర్వహించాలని నిర్ణయించాయి.

పాకిస్థాన్ ప్రజాస్వామిక ఉద్యమం (పీడీఎం) పేరుతో 11 ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. పీడీఎం స్టీరింగ్ కమిటీ సమావేశంలో 6 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. సెప్టెంబరు 20న ఇస్లామాబాద్‌లో జరిగిన బహుళ పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తొలి దశలో ఈ సభలను నిర్వహిస్తారు. 

స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఈ కూటమి కన్వీనర్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ నేత అహసాన్ ఇక్బాల్ మీడియాకు వివరించారు. 

గుజ్రన్‌వాలాలో ఈ నెల 16న, కరాచీలో ఈ నెల 18న, క్వెట్టాలో ఈ నెల 25న, పెషావర్‌లో నవంబరు 22న, ముల్తాన్‌లో నవంబరు 30న, లాహోర్‌లో డిసెంబరు 13న భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైనందువల్ల ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పాటైందని చెప్పారు.