విజయవంతంగా శౌర్య క్షిపణి ప్రయోగం 

అణ్వస్త్రాలను మోసుకెళ్లగల సామర్ధ్యం ఉన్న శౌర్య క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. 

శౌర్య క్షిపణి పరిధి 800 కిలోమీటర్లు. ఇది భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగించే వీలున్న క్షిపణి. ఇటీవల కాలంలో శౌర్యను మరింత అభివృద్ధి చేశారు. 

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచిన అప్ డేటెడ్ వెర్షన్ ను ఇవాళ(శనివారం) పరీక్షించి చూశారు. ఆధునికీకరించిన శౌర్యను త్వరలోనే వ్యూహాత్మక బలగాలకు అందించనున్నారు.

ప్రస్తుతం పాత వెర్షన్ శౌర్య భద్రతా బలగాల దగ్గర ఉంది. అయితే కొత్తది ఎంతో తేలికైనది, ప్రయోగించడానికి ఎంతో సులువైనదని రక్షణ రంగ వర్గాలు తెలిపాయి. 

శౌర్య క్షిపణి ప్రత్యేకత ఏంటంటేలక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో హైపర్ సోనిక్ వేగం అందుకుంటుంది. ఆ తర్వాత దీన్ని నిలువరించడం ఏ వ్యవస్థకు సాధ్యం కాదు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది.

ఇదిలావుండగా, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో మంగళవారం లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. దీనిని దేశీయంగానే అభివృద్ధిపరిచారు. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ పరీక్ష కూడా బుధవారం విజయవంతమైంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన స్వయం సమృద్ధ భారత్ నినాదానికి అనుగుణంగా మిసైల్స్‌ను అభివృద్ధిపరిచేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) కృషి చేస్తోంది. స్ట్రాటజిక్ మిసైల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తోంది.