దేశంలో ల‌క్ష దాటిన క‌రోనా మృతులు

దేశంలో క‌రోనా మృతుల సంఖ్య‌ ల‌క్ష దాటింది. గ‌త నెల రోజులుగా ప్ర‌తిరోజూ వెయ్యికి పైగా క‌రోనా బాధితులు మ‌రణిస్తున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 1069 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల ల‌క్షా 842 మంది చ‌నిపోయారు. 

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 79,476 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 64,73,545కి చేరింది. ఇందులో 9,44,996 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 54,27,707 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 

దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ‌త వారం రోజుల్లో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గింద‌ని తెలిపింది. ప్ర‌తిరోజు అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా బాధితులు కోలుకుంటుండ‌టంతో యాక్టివ్ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయ‌‌ని తెలిపింది. 

నిన్న న‌మోదైన కేసుల్లో ప‌ది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 76.62 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా 2,61,313 మంది క‌రోనా బాధితులు చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది.  

దేశంలో అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు మొత్తం 7,78,50,403 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. నిన్న ఒక్క‌రోజే 11,32,675 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.