ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ హత్యాచార ఘటనకు నిరసనగా హైదరాబాద్ లోరాష్ట్ర బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది.
వారిని బీజేపీ కార్యాలయానికి కొద్ది దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన బీజేపీ నాయకులు కార్యాలయం నుండి అక్కడికి వచ్చి రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రేవంత్ రోడ్డుపైనే బైఠాయించారు.
కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడంతో వారు కూడా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఒక దశలో బీజేపీ నాయకులు రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను రోడ్డుపైన దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాంపల్లి ప్రధాన రోడ్డుపై ఉద్రిక్తత నెలకొంది.
రేవంత్ నాంపల్లి ప్రధాన రోడ్డుపైన కార్యకర్తలతో బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవంక, ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డగించారు.
మరోవైపు కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ ప్రదర్శనలతో గాంధీభవన్, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
More Stories
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం
విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు