రేపే జగన్ ముంగిట గంటా శ్రీనివాసరావు 

అధికారం లేనిదే రాజకీయం లేదనుకొంటూ ఎప్పటికప్పుడు అధికార పార్టీలలోకి మారిపోతుంది మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు వైసిపి గడప తొక్కేందుకు ముహర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ ఎదురు చూడడం ఆయనకు కలిసి వచ్చింది. 

చాలాకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ శనివారం ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవుతున్నట్లు చెబుతున్నారు. వైసిపి ముంగిట చేరుతున్న ఇతర టిడిపి ఎమ్యెల్యేల వలే ఆయనకూడా సాంకేతిక కారణాల రీత్యా నేరుగా అధికార పక్షంలో చేరకుండా  జగన్ సమక్షంలో ఆయన కుమారుడు వైసిపి తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి జగన్ అధికారంలోకి రాగానే అధికార పక్షంలో చేరడానికి గంటా సిద్దమై, టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నికల ముందే టిడిపి నుండి చేరిన స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో ఉన్న రాజకీయ వైరుధ్యం కారణంగా ఇప్పటి దాకా సాధ్యం కాలేదని చెబుతున్నారు.

దానితో కొద్దిరోజుల క్రితం గంటా నేరుగా జగన్ సన్నిహితులతో మాట్లాడుకొని చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు. పైగా, గంటాకు విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడానికి సహితం మంత్రి హోదాతో జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ మూడో కంటికి తెలియకుండా జగన్‌ను కలిసారు. విద్యా వ్యాపారంలో వున్న ఆయన ముందుకు సాగాలంటే అధికార పార్టీ అండ తప్పదని అటు చేరినట్లు చెబుతున్నారు. వాసుపల్లి చడీచప్పుడు లేకుండా అమరావతి వెళ్లి తన ఇద్దరు కుమారులతో కలిసి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీకి మద్దతు ప్రకటించారు.  

విశాఖపట్నంపై పట్టుకోసం జగన్ చాలాకాలంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల బరిలో నేరుగా తన తల్లి విజయలక్ష్మినే లోక్ సభకు అభ్యర్థిగానిలిపారు. ఆమె నాటి బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ విజయఢంకా మోగించినా విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్లోనూ ఓటమి చవిచూసింది. 

ఇక్కడ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం నియోజక వర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు.ఈ పరాయజయాన్ని  వైసీపీ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా ఆ నలుగురిని పార్టీలోకి రప్పించుకుంటే విశాఖలో ఇక తిరుగు వుండదని వ్యూహాలకు పదును పెట్టింది. ముందుగా పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా జరపడం ప్రారంభించారు. 

విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నా ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. 

1999 ఎన్నికలలో ఒంగోలు నుండి అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం ప్రయత్నించి, సీట్ రాకపోవడంతో చివరి క్షణంలో అనకాపల్లి నుండి టిడిపి అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి గంటా రాజకీయ ప్రవేశం చేశారు.

2004లో టిడిపి అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసహనంగా గడిపారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్యెల్యేగా ఎన్నికై,  ఆ పార్టీ కాంగ్రెస్ తో  విలీనం కావడంతో మంత్రి కాగలిగారు. 2014లో టిడిపి అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికై ఐదేళ్లు మంత్రిగా ఉన్నారు.