టీడీపీ పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ రాజీనామా

టీడీపీ పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ రాజీనామా
టీడీపీ పొలిట్‌బ్యూరోకు  గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. బుధవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామాను అరుణకుమారి పంపారు. సుధీర్ఘకాలం అరుణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అరుణకుమారి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 
 
2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో ఆమె తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ అరంగ్రేటం చేశారు. టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా గుంటూరు నుంచి తిరిగి పార్లమెంట్‌కు జయదేవ్ ఎన్నికయ్యారు. 
 
చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989, 1999,2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా అరుణ గెలిచారు. శాసనసభకు ఎన్నికైన మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. 2008లో వైద్య, విద్య, ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేశారు. ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేసిన సమయంలో ఆరోగ్యశ్రీ పథకానికి ముఖ్య భూమిక పోషించారు. 
 
ఈ తర్వాత 2009 ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో భూగర్భ, గనుల శాఖా మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన అరుణ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
ఇప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరోకు రాజీనామా చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.