తిరిగి భారీగా జీఎస్టీ వసూళ్లు  

తిరిగి భారీగా జీఎస్టీ వసూళ్లు  

కరోనా సంక్షోభంతో గణనీయంగా పడిపోయిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో ఈ వసూళ్లు భారీగా పెరిగి రూ.95,480 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్థాయి.

గతేడాది సెప్టెంబర్‌లో వసూలైన రూ.91,916 కోట్ల కంటే ఈసారి జీఎస్టీ వసూళ్లు 4 శాతం పెరుగడం విశేషం. గత నెలలో కేంద్ర జీఎస్టీ కింద రూ.17,741 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.23,131 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కింద రూ.47,484 కోట్లు, సెస్సు రూపంలో రూ.7,124 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

కొవిడ్‌-19 సంక్షోభం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యంత దారుణంగా రూ.32,172 కోట్లకు పడిపోయిన జీఎస్టీ వసూళ్లు.. మే నెలలో రూ.62,151 కోట్లకు, జూన్‌లో రూ.90,917 కోట్లకు, జూలైలో రూ.87,422 కోట్లకు, ఆగస్టులో రూ.86,449 కోట్లకు చేరాయి. గత నెల తెలంగాణలో రూ.2,796 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏపీలో ఈ వసూళ్లు రూ.2,141 కోట్లుగా ఉన్నాయి.