రూ 2 కోట్ల వరకు రుణాల‌పై వ‌డ్డీ మాఫీ

మార‌టోరియం స‌మ‌యంలో కొన్ని ర‌కాల రుణాల‌పై వ‌డ్డీ వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని కేంద్ర ప్రభుత్వం నేడు సుప్రీం కోర్ట్ కు తెలిపింది. ఆరు నెల‌ల మార‌టోరియం కాలంలో రూ.2 కోట్ల వ‌ర‌కుగ‌ల రుణాల‌పై వ‌డ్డీ వ‌దులుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది.  

లాక్‌డౌన్ సంద‌ర్భంగా రుణాల‌కు సంబంధించి ఆరు నెల‌ల‌పాటు  విధించిన‌ మార‌టోరియంపై కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఆరు నెల‌ల మార‌టోరియం పీరియ‌డ్‌లో రుణాల‌పై వ‌డ్డీ మాఫీ విష‌యంలో త‌న నిర్ణ‌యాన్ని కేంద్రం అఫిడ‌విట్‌లో వివరించింది.  

ఎంఎస్ఎంఈలు, గృహ రుణాలు‌, విద్యా రుణాలు‌, వాహ‌న రుణాలు, క్రెడిట్ కార్డు బ‌కాయిల‌పై, వినియోగ‌దారు వ‌స్తువుల ఈఎంఐల‌పై వ‌డ్డీల‌ను మిన‌హాయించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ ద్వారా సుప్రీకోర్టుకు వివ‌రించింది. స‌మ‌స్య‌కు వ‌డ్డీ భారాన్ని భ‌రించ‌డ‌మే ఏకైక ప‌రిష్కార‌మ‌ని నిర్ణ‌యించిన‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నది. 

అయితే అన్ని ర‌కాల రుణాల‌కు వ‌డ్డీని చెల్లించాలంటే రూ.6 ల‌క్ష‌ల కోట్లు భారం ప‌డుతుంద‌ని, అది చాలా అధిక‌మ‌ని, అందుకే రూ.2 కోట్లు ఆ లోపుగ‌ల రుణాల‌కే వ‌డ్డీ చెల్లించాల‌ని నిర్ణ‌యించామ‌ని కేంద్రం తెలిపింది. మార‌టోరియం పీరియ‌డ్ రుణాల‌కు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర స‌ర్కారు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌ రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా ఉంద‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

క‌రోనా విస్త‌ర‌ణ నేప‌థ్యంలో రుణ గ్ర‌హీత‌ల‌కు వెసులుబాటు క‌లిగేలా  ఏప్రిల్‌ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆరు నెల‌లపాటు కేంద్రం మార‌టోరియం విధించింది. అయితే బ్యాంకింగ్ సంస్థ‌లు మార‌టోరియం స‌మ‌యంలో బకాయిల‌పై వ‌డ్డీలు లెక్క‌గ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో విష‌యం కోర్టుకు చేర‌గా.. కోర్టు ఆదేశాల మేర‌కు తాజాగా కేంద్రం అఫిడ‌విట్ స‌మ‌ర్పించింది.