పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం మరింత ఊరట కల్పించింది. 2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును మరో రెండు నెలలు (నవంబర్ 30 వరకు) పొడిగించింది.
కొవిడ్-19 సంక్షోభంతో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న వాస్తవిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్య చేపట్టినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆలస్యంగా దాఖలుచేసే రిటర్నులతోపాటు సవరించిన రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించినట్టు తెలిపింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒరిజినల్, సవరించిన ఐటీఆర్‌ల దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. గతంలో ఈ గడువును మార్చి 31 నుంచి జూన్ 30కి, అనంతరం జూలై 31కి, ఆ తర్వాత సెప్టెంబర్ 30కి పొడిగించిన విషయం తెలిసిందే.
మరోవంక,2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్నులు, ఆడిట్ రిపోర్టుల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు పొందిన తర్వాతే ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ట్వీట్ చేసింది.
ఈ అనుమతుల మేరకే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9సీ వార్షిక రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 వరకు పొడిగించిందని సీబీఐసీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువును పొడిగించడం ఇది రెండోసారి. మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును మూడు నెలలు (సెప్టెంబర్ 30 వరకు) పొడిగించిన విషయం విదితమే.
More Stories
రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్
సగానికి పైగా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకే
భారత్ స్వయంగా అనేక ‘సింగ్పూర్’లను సృష్టిస్తోంది