రూ.4.34 లక్షల కోట్ల రుణాలను సమీకరించనున్న కేంద్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్ధం (అక్టోబర్‌-మార్చి)లో కేంద్ర ప్రభుత్వం రూ.4.34 లక్షల కోట్ల రుణాలను సమీకరించనున్నది. కొవిడ్‌-19 సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో వ్యయ అవసరాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ రుణాలను సమీకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు. సెప్టెంబర్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం రూ.7.66 లక్షల కోట్ల రుణాలను సేకరించిందని, మిగిలిన రూ.4.34 లక్షల కోట్ల రుణాలను ద్వితీయార్ధంలో సమీకరిస్తుందని ఆయన వివరించారు.
డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సమీకరించదల్చుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాల్లో 58 శాతం (రూ.6.98 లక్షల కోట్ల) రుణాలను ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో) సేకరించాలని కేంద్రం తొలుత భావించింది. కానీ అందుకు భిన్నంగా రూ.7.66 లక్షల కోట్ల రుణాలను సమీకరించింది. కరోనా సంక్షోభమే ఇందుకు కారణం.
వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్ల రుణాలను సేకరించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.7.80 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని నిర్ణయించింది. పార్లమెంట్‌లో సార్వత్రిక బడ్జెట్‌ ప్రతిపాదన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కరోనా వైరస్‌తో పోరాడేందుకు మరిన్ని నిధులు అవసరమవడంతో కేంద్రం రుణ సమీకరణ లక్ష్యాన్ని 50 శాతానికిపైగా పెంచి రూ.12 లక్షల కోట్లకు చేర్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశ కరెంట్‌ ఖాతా మిగులు 19.8 బిలియన్‌ డాలర్ల (రూ.1,45,841 కోట్ల)కు పెరిగింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.9 శాతానికి సమానం. కొవిడ్‌-19 సం క్షో భం నేపథ్యంలో వాణిజ్య దిగుమతులు తగ్గడం.. ఫలి తంగా దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా) 10 బిలియన్‌ డాలర్ల (రూ.73,653 కోట్లకు)కు దిగిరావడం కరెంట్‌ ఖాతా మిగులు వృద్ధికి కారణమని రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) వెల్లడించింది.
గతేడాది జనవరి-మార్చి త్రైమాసికం చివరి నాటికి కరెంట్‌ ఖాతాలో 15 బిలియన్‌ డాలర్ల (రూ.1,10,492 కోట్ల) లోటు నమోదగవగా.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 0.6 బిలియన్‌ డాలర్ల (రూ.4,419 కోట్ల) మిగులు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశ కరెంట్‌ ఖాతా మిగులు 30 బిలియన్‌ డాలర్ల (రూ.2,20,977)కు పెరుగుతుందని, కానీ ఈ పెరుగుదల ఇది తాత్కాలికమేనని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఇటీవల తన నివేదికలో అభిప్రాయపడింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ద్వారాలను తెరుస్తున్నదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. దేశంలోకి కొత్త పెట్టుబడులను తీసుకురావడంలో ఎదురవుతున్న అవరోధాలను తొలిగించేందుకు ప్రభుత్వం వివిధ మార్గాల్లో కసరత్తు చేస్తున్నదని చెప్పారు.
ఇప్పటికే రక్షణ రంగంతోపాటు, బొగ్గు తవ్వకాల్లో ప్రైవేట్‌ రంగానికి పెద్దపీట వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు సింగిల్‌ బ్రాండ్‌ రిటైలింగ్‌లో ప్రభుత్వం అనేక మార్పులు చేసిందని, ఇదేవిధంగా విమానయాన, వ్యవసాయ, ఆర్థిక సేవల రంగాల్లోనూ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నదని పీయూష్‌ గోయల్‌ వివరించారు.