వ్యవసాయ బిల్లులపై సుప్రీంకోర్టుకు పంజాబ్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై తమ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భగత్‌ సింగ్‌ గ్రామమైన ఖట్కార్‌ కలన్‌లో రైతులు చేపట్టిన నిరసనదీక్షలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కార్‌ హరిస్తోందని మండిపడ్డారు. 
 
వ్యవసాయ రంగాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకుంటే.. ఇక రాష్ట్రాలకు మిగిలేది ఏముందని, రాష్ట్రాల భవిష్యత్‌ ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవనోపాధిని లాక్కునే హక్కు కేంద్రానికి ఎక్కడిదని ప్రశ్నించారు. 
 
ఈ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశామని, అయినప్పటికీ ఆమోదం పొందాయని, వీటిని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు మంగళవారం రాష్ట్రానికి చేరుకుంటారని, సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై వారితో చర్చిస్తామని చెప్పారు.  
 
మరోవంక,  కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తిరస్కరించేందుకు అవకాశాలను పరిశీలించాలని బిజెపియేతర రాష్ట్రాలకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254 (2) ప్రకారం కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా తమ రాష్ట్రాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని, రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు అనంతరం రాష్ట్రపతి దగ్గరకు వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  కెసి వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు.