చైనాలో విచ్చలవిడిగా కరోనా టీకాలు 

చైనాలో విచ్చలవిడిగా కరోనా టీకాలు 
చైనాలో విచ్చలవిడిగా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా లక్షలమంది ప్రజలపై విచ్చలవిడిగా ‘అత్యవసరం’ పేరిట ప్రయోగదశలోనే ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడంపై కలకలం చెలరేగుతుంది. 
 
చైనాలో తయారుచేస్తున్న వ్యాక్సిన్లన్నీ మూడోదశ ట్రయల్స్‌లో ఉన్నాయి. వాటి ప్రయోజనం నిర్ధారణ కాకుండానే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల సిబ్బంది, సైనికులు, పోలీసులు, కస్టమ్స్‌, సూపర్‌ మార్కెట్ల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వంటివారికి ‘అత్యవసర’ వ్యాక్సిన్లు వేస్తున్నారు. 
 
దీంతో వారి ఆరోగ్య భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. ‘అత్యవసర’ వ్యాక్సిన్‌ వేయించుకొని లక్షలాది మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పైగా అత్యవసర వ్యాక్సిన్‌వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి ఎవరికీ చెప్పొద్దంటూ వ్యాక్సినేషన్‌ సమయంలోనే వారితో ‘నాన్‌ డిస్‌క్లోజర్‌’ ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
అత్యవసర వ్యాక్సిన్‌ అనర్ధాలు సృష్టిస్తోందని తెలిసినా చైనాలోని కంపెనీల ఉద్యోగు లు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించే సాహసం చేయలేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు. సినోఫార్మ్‌, సినోవ్యాక్‌ కంపెనీలు అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్లను అత్యవసర ప్రాతిపదికన లక్షలాది మందికి అందించారని సమాచారం. ఈ విషయమై ప్రభుత్వ వర్గాలు మౌనం పాటిస్తున్నాయి.