పాక్ లో 49 మంది జర్నలిస్టులు అరెస్ట్!

పాకిస్తాన్‌లో మీడియాపై దారుణ అణచివేత కొనసాగుతోంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకుంటోంది. మీడియాపై అణచివేత లేనేలేదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నా.. జర్నలిస్టు ముబషిర్ జైదీ తన సహచరుల అరెస్టులను బయటపెట్టడంతో  ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

‘‘పాకిస్తాన్‌లో జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున అణచివేత కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్ నేరాల నిరోధక చట్టం (పెకా) కింద ఎఫ్ఐఏ ఇప్పటి వరకు 49 జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది. ఉమర్ చీమా, అజాజ్ సయ్యద్, ముర్తజాసొలాంగ్, అమ్మార్ మసూద్, అసద్ అతూర్, బిలాల్ఫ్కి తదితరులు ఉన్నారు..’’ అని ముబషీర్ జైదీ ట్వీట్ చేశారు.

కేసులను ఉపసంహరించుకోవాలని పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇప్పటికే డిమాండ్ చేసిందనీ… లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల అరెస్ట్‌ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు షెర్రీ రెహ్మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీడియా స్వేచ్ఛను హరించే క్రూరమైన చర్య అంటూ దుయ్యబట్టారు.

‘‘ప్రభుత్వం తన బుద్ధి బయటపెట్టుకుంది. పాకిస్తాన్‌లోని మీడియా గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది గొడ్డలిపెట్టు..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ సైతం మీడియా ప్రతినిధుల అరెస్టులను ఖండించింది.