రఫెల్ పై కాగ్ ఘాటైన విమర్శ 

ఒప్పందం ఖరారు అయ్యేంతవరకూ విదేశీ సంస్థలు ఇలాంటి ఆశలు చూపుతాయని, ఒకసారి ఒప్పందం ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని నెరవేర్చవని అంటూ మనకు అత్యాధునిక యుద్ధ విమానాలను సరఫరా చేస్తున్న రఫెల్ పై కాగ్‌ ఘాటుగా విమర్శించింది.  
 
రాఫెల్‌ ఒప్పందంలో భాగంగా చేసుకున్న సాంకేతికత బదిలీ ప్రక్రియను ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌, ఎంబీడీఏ సంస్థలు ఇంకా పూర్తిచేయలేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలిపింది. ఈ మేరకు కాగ్‌ విడుదల చేసిన ఓ ప్రకటన బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చింది. 
 
స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న కావేరీ జెట్‌ ఇంజిన్‌లకు అవసరమయ్యే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు అందజేస్తామని 2015లో రాఫెల్‌ ఒప్పందం చేసుకున్న సందర్భంలో దసాల్ట్‌ ఏవియేషన్‌, ఎంబీడీఏ సంస్థలు పేర్కొన్నాయి. 
 
ఈ సాంకేతికత బదిలీ ప్రక్రియ రాఫెల్‌ ఒప్పందంలో భాగమేనని చెప్పాయి. అయితే, ఇచ్చిన మాట ప్రకారం.. డీఆర్డీవోకు ఇంకా ఎలాంటి సాంకేతికత సహకారం అందలేదని కాగ్‌ తెలిపింది.
 
మరోవంక, 15 రాష్ర్టాల్లో ఉన్న కనీసం 75 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని కాగ్‌ పార్లమెంటుకు మరో నివేదికలో వెల్లడించింది. ఇంకోవైపు, ఎలక్ట్రిక్‌ లోకోల (ఎలక్ట్రిక్‌ రైలు ఇంజిన్‌) అవసరాన్ని అంచనా వేయడంలో రైల్వేశాఖ విఫలమైందని కాగ్‌ పేర్కొంది. 
 
2012-18 మధ్య డీజిల్‌తో నడిచే లోకోలు 20 శాతం పెరిగాయని 2022 నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్‌తో నడిచే రైళ్లను ప్రవేశ పెట్టాలన్న లక్ష్యానికి ఇది అవరోధంగా మారుతుందని అభిప్రాయపడింది.