చైనా నుండి త‌గ్గిన దిగుమ‌తులు  

చైనా నుండి దేశానికి దిగుమ‌తులు త‌గ్గిన‌ట్లు కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. రాజ్య‌స‌భ‌కు బుధ‌వారం ఇచ్చిన‌ లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో మంత్రి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

గ‌డిచిన‌ ఏప్రిల్ నుంచి జులై వ‌ర‌కు 16.60 బిలి‌య‌న్ డాల‌ర్ల బిజినెస్ జ‌ర‌గ‌గా అంత‌కుముందు ఏడాది ఇదే కాలంలో 23.45 బిలియ‌న్ డాల‌ర్ల దిగుమ‌తులు జ‌రిగాయని పేర్కొ‌న్నారు. అనేక ప్రపంచ, దేశీయ సరఫరా వైపు పరిమితులు ఉన్నాయని అదేవిధంగా కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రపంచ డిమాండ్ కూడా తగ్గిందని చెప్పారు.

ఎలక్ట్రానిక్ భాగాలు, టెలికాం పరికరాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌, పాడి, పారిశ్రామిక యంత్రాలు, రసాయన దాని అనుబంధ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎరువులు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు మొదలైన పారిశ్రామిక యంత్రాల దిగుమతుల్లో క్షీణతను ఉన్న‌ట్లు వివరించారు. 

దిగుమ‌తుల క్షీణ‌త ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు దేశీయ ఉత్ప‌త్తి సామర్థ్యాలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, ప్రొడ‌క్ష‌న్ లింక్‌డ్ ఇన్సెంటీవ్స్ ద్వారా దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను అమలు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. 

మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ భాగాలు, వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్‌తో సహా ఎంపిక చేసిన రంగాలలో ఉత్ప‌త్తిని పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా భద్రత, భారత సైబర్‌స్పేస్ సార్వభౌమత్వాన్ని ప‌రిర‌క్షించేందుకు జూన్‌, సెప్టెంబ‌ర్ మాసాల్లో ప్రభుత్వం ప‌లు యాప్‌లను నిషేధించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.