8 మంది రాజ్య‌స‌భ ఎంపీల‌పై స‌‌స్పెన్ష‌న్‌  

వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టిన విప‌క్ష ఎంపీల‌పై చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు చ‌ర్య తీసుకున్నారు.  డెరిక్ ఓబ్రెయిన్‌తో పాటు 8 మంది స‌భ్యుల‌పై రాజ్య‌స‌భ స‌స్పెన్ష‌న్ విధించింది.
ఆదివారం రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న గుర్తు చేస్తూ విప‌క్ష ఎంపీలు సోష‌ల్ డిస్టాన్స్‌, కోవిడ్ నిబంధ‌న‌లు విస్మ‌రించారన్నారు.  రాజ్య‌స‌భ‌కు నిజంగా అది బ్యాడ్ డే అన్నారు.  కొంద‌రు స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చార‌ని, డిప్యూటీ చైర్మ‌న్‌పై పేప‌ర్లు, రూల్ బుక్‌ను విసిసిర‌న‌ట్లు చైర్మ‌న్ వెంక‌య్య తెలిపారు.
బెంచ్‌ల‌పై డ్యాన్సులు చేయడం, పేప‌ర్లు విసిరేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, ఇదేమైనా పార్ల‌మెంట‌రీ మ‌ర్యాద‌నా అని ఆయ‌న నిల‌దీశారు. ఓ ద‌శ‌లో డెరిక్ ఓబ్రెయిన్‌పై వెంక‌య్య ఫైర్ అయ్యారు. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాలంటూ ఆదేశించారు.  ఆదివారం రోజున మార్ష‌ల్స్ రాకుంటే డిప్యూటీ చైర్మ‌న్‌పై విప‌క్ష స‌భ్యులు దాడి చేసేవార‌ని పేర్కొన్నారు.
మ‌న‌మే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు నిబంధ‌న‌ల గురించి వివ‌రిస్తుంటామ‌ని, మ‌న‌మే ఆ నిబంధ‌న‌లను పాటించ‌కుంటే ఎలా అని ప్రశ్నించాన్నారు. డిప్యూటీ చైర్మ‌న్‌ను భౌతికంగా బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే డిప్యూటీ చైర్మ‌న్‌పై విప‌క్ష స‌భ్యులు ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానం చెల్ల‌దుని వెంక‌య్య ప్ర‌క‌టించారు. 90 సీ నిబంధ‌న ప్ర‌కారం డిప్యూటీ చైర్మ‌న్‌పై నోటీసు ఇవ్వ‌డానికి 14 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని, ప్ర‌తిప‌క్ష‌నేతతో పాటు ఇత‌ర స‌భ్యులు ఇచ్చిన నోటీసులు చెల్ల‌దు అని చైర్మ‌న్ వెంక‌య్య తెలిపారు. దీంతో విప‌క్ష స‌భ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు స‌రైన రీతిలో లేద‌ని తిర‌స్క‌రించారు.
పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముర‌ళీధ‌ర‌న్ 8 మంది స‌భ్యుల‌ను స‌భ నుంచి వారం పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఈ సెష‌న్ మొత్తం వారిపై వేటు వేస్తున్న‌ట్లు తెలిపారు.
డిప్యూటీ చైర్మ‌న్‌పై రూల్ బుక్ విసిరిన డెరిక్ ఓబ్రెయిన్‌తో పాటు 8 మంది విప‌క్ష స‌భ్యుల‌పై స‌స్పెష‌న్ విధించారు. డెరిక్ ఓబ్రెయిన్‌, సంజ‌య్ సింగ్‌, రాజీవ్ స‌తావ్‌, కేకే రాజేశ్‌, స‌య్యిద్ న‌జీర్ హుస్సేన్‌, రిపున్ బోరా, డోలా సేన్‌, ఇల‌మారం క‌రీమ్‌లు ఆ జాబితాలో ఉన్నారు.