రూ.760 కోట్ల పోలవరం బిల్లుల తిరస్కరణ

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి ఏప్రిల్‌ 2014 నుంచి జూలై 2020 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 12,505 కోట్లలో  760.118 కోట్ల విలువైన బిల్లులు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) ఆమోదానికి నోచుకోలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి  రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు.
 
రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ  ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చులో 478.95 కోట్లకు సంబంధించిన బిల్లులు ఇంకా తమకు సమర్పించాల్సి ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడతల వారీగా 8,614 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. 
 
పోలవరం ప్రాజెక్ట్‌ను 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం కారణంగా  వచ్చే మార్చి నాటికి  రూ 15,000 కోట్ల  నిధులు అవసరం ఉంటుందంటూ గత ఆగస్టు 25న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ నాలుగు రోజుల క్రితమే (సెప్టెంబర్‌ 15న) తమకు అందిందని మంత్రి వెల్లడించారు. 
 
పోలవరం ప్రాజెక్ట్ కోసం తదుపరి నిధుల విడుదల కోసం ఆడిట్‌ చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరిన మీదట గత ఆగస్టు 21న రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను సమర్పించింది. అలాగే సవరించిన ఖర్చు అంచనాలను సైతం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను సమర్పించిందని మంత్రి తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్ట్‌లో నిర్మాణ పనుల పురోగతి, వాటికి సంబంధించిన బిల్లులను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ధృవపరచి, అవి షరతులకు లోబడి ఉన్నట్లుగా సంతృప్తి చెందిన మీదటే తదుపరి నిధుల విడుదల జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.