వ్యాపారాన్ని నిలబెట్టడమే చాలా ముఖ్యం  

బకాయిల వసూలు కంటే వ్యాపారాన్ని నిలబెట్టడమే చాలా ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. శనివారం రాజ్యసభలో దివాలా చట్టం (ఐబీసీ) 2020 (రెండో సవరణ) బిల్లును వాయిస్‌ ఓటుతో ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ దివాలా ప్రక్రియ ద్వారా 258 సంస్థలను కాపాడగలిగామని, 965 సంస్థలు నగదీకరణకు వెళ్లాయని తెలిపారు.
ఒక సంస్థ కుప్పకూలితే ఎందరో రోడ్డున పడాల్సి వస్తుందన్న నిర్మల దివాలా చర్యల నుంచి బయటపడ్డ 258 సంస్థలకు రూ.96 వేల కోట్ల ఆస్తులున్నాయని గుర్తుచేశారు. నగదీకరణకు వెళ్లిన 965 సంస్థలకు రూ.38 వేల కోట్ల ఆస్తులే ఉన్నాయని పేర్కొన్నారు. కరోనాతో వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయని, అందుకే సెక్షన్‌ 7, 9, 10లను కనీసం ఆరు నెలలపాటు తొలగించడమే ఉత్తమంగా భావించామని చెప్పారు. దీనివల్ల ఒత్తిడిలో ఉన్న కార్పొరేట్లకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.
ఇక మార్చి 25 నుంచి రుణాలను చెల్లించలేకపోతున్నవారిపై దివాలా చర్యలు తీసుకోరాదని, కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు. కాబట్టే పై సెక్షన్లను సస్పెండ్‌ చేశామన్న మంత్రి వచ్చే వారం దీని పొడిగింపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే తాత్కాలికంగా తీసేసిన సెక్షన్ల స్థానంలో ‘10ఏ’ను తెచ్చారు. ఇదిలావుంటే కార్పొరేట్‌ రుణగ్రహీతలతోపాటు వ్యక్తిగత పూచీకత్తుదారులపై ఒకేసారి దివాలా చర్యలుంటాయని తెలిపారు.
 ‘కార్పొరేట్‌ రుణగ్రహీతకు సాధారణంగా పూచీకత్తుదారులు ఉంటారు. కాబట్టి సమగ్రమైన కార్పొరేట్‌ దివాలా తీర్మానం, నగదీకరణ తప్పనిసరి. అందుకే కార్పొరేట్‌ రుణగ్రహీతలతోపాటు పూచీకత్తుదారులపై ఏకకాలంలో దివాలా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాం’ అని వివరించారు.
డిసెంబర్‌ 2016లో ఐబీసీ అమల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా ఐదుసార్లు సవరించగా, ఈ జూన్‌లో ఇచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలోనే సవరణ బిల్లును ఆమోదించారు. 
 
రాష్ట్రాలకు కాంపన్సేషన్‌‌‌‌ జీఎస్టీ చెల్లింపుపై   రాష్ట్రాల మధ్య ఒకేరకమైన అభిప్రాయం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. సీజీఎస్టీపై తదుపరి సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌‌‌‌ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. మాజీ మంత్రి అరుణ్ జైట్లీతోపాటు తాను రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపుపై ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని హామీ ఇస్తూ ఆమె పార్లమెంటులో ప్రకటన చేశారు. 
కాగా, 2018-19లో లోక్‌ అదాలత్‌ల ద్వారా 5.3 శాతం మొండి బకాయిలు వసూలయ్యాయని, రుణ రికవరీ ట్రిబ్యునళ్ల ద్వారా 3.5 శాతం, సర్ఫేసీ ద్వారా 14.5 శాతం వసూళ్లు నమోదయ్యాయని నిర్మల తెలిపారు. ఐబీసీ ద్వారా వసూళ్లు 42.5 శాతంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇలా ఉండగా, రూ.2వేల నోటు ముద్రణను ఆపేయాలన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభకు తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌తో చర్చించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని ఓ లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.
2019-20, 2020-21లో రూ.2వేల నోట్లను ముద్రించని సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో 27,398 లక్షల రూ.2వేల నోట్లున్నాయని చెప్పారు. గతేడాది మార్చి 31 నాటికి ఇవి 32,910 లక్షలుగా ఉన్నాయన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో అన్ని రకాల నోట్ల ముద్రణను తాత్కాలికంగా ఆపేసినట్లు ఆర్బీఐ తెలిపిందని తెలియజేశారు.
 
పన్ను బిల్లులకు లోకసభ ఆమోదం తెలిపింది. కరోనా వైరస్‌ కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ పన్నుల బిల్లు శనివారం లోకసభ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రిటర్నులు, పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు పెంపుపై భారీ ఊరట లభించినట్లు అయింది. 
 
పన్నుకు సంబంధించిన ఇతర చట్టాలు, పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఇచ్చిన విరాలాలపై పన్ను మినహాయింపు చట్టం కూడా వీటిలో ఉన్నాయి.  మరోవైపు కంపెనీ బిల్లుకు కూడా మోక్షం లభించింది.