భారత దౌత్య అధికారికి పాక్ సమన్లు

భారత దౌత్య అధికారికి పాకిస్థాన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత సైన్యం ఉల్లంఘించిందని అంటూ  నిరసన తెలిపింది. నియంత్రణ రేఖ వెంబడి హాట్‌స్ప్రింగ్, జాండ్రోట్ సెక్టార్లలో గురువారం భారత ఆర్మీ విచక్షణ రహితంగా కాల్పులు జరిపిందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది.

ఈ కాల్పుల వల్ల 15 ఏండ్ల ఇరుమ్ రియాజ్, ఆండ్రాల నార్ గ్రామానికి చెందిన  16 ఏండ్ల ముఖీల్, 26 ఏండ్ల నుస్రత్ కౌసర్ గాయపడినట్లు తెలిపింది. సరిహద్దులోని పాక్ గ్రామాల ప్రజలను భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నదని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్య అధికారిని తమ వద్దకు పిలిపించుకుని నిరసన తెలిపింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు భారత ఆర్మీ 2,280 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడిందని, 18 మంది పాక్ పౌరులు మరణించారని ఆ దేశం పేర్కొంది. 2003లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన భారత్ దానికి కట్టుబడి ఉండటం లేదని పాకిస్థాన్ ఆరోపించింది.

కాగా భారత దౌత్య అధికారికి పాక్ సమన్లు జారీ చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. గత వారం కూడా ఇదే అంశంపై భారత దౌత్య సీనియర్ అధికారిని పిలిపించుకుని పాక్ నిరసన వ్యక్తం చేసింది.