వైసీపీ వచ్చాక హిందూ మతాన్ని టార్గెట్ చేసింది

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతాన్ని టార్గెట్ చేసిందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ అండతోనే అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దేవాలయాల ఆస్తుల అమ్మకం, అన్యమతస్తుల ప్రమేయం ఎక్కువైందని ధ్వజమెత్తారు. 
 
ఏపీలో మతమార్పిడులు యధేచ్చగా జరుగుతున్నాయని కన్నా దయ్యబట్టారు. గతంలో మత మార్పిడికి అభ్యంతరం చెబితే వెళ్లిపోయేవారని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మత మార్పిడులు చేసే వారు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతాన్ని అంతం చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందని హెచ్చరించారు. 
 
చర్చి మీద రాళ్లు వేశారని 41 మందిని సెలెక్ట్ చేసి మరీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని, అదే అంతర్వేది రథం తగలబెడితే ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. శ్రీశైలంలో అన్యమతస్తుల ప్రమేయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని కన్నా విమర్శించారు.  
 
కాగా, ఏపీలో `చలో అమలాపురం’ కారక్రమంకు వెడుతున్న బిజెపి నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ లు చేయడం పట్ల బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో హిందూ ఆలయాల మీద దాడులపై హోమ్ మంత్రి అమిత్‌ షాకు రాసినట్లు ఆయన వెల్లడించారు.

‘రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వం మతపరంగా వ్యవహరిస్తోందని అమిత్ షాకు లేఖలో పేర్కొన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర హోంమంత్రిని కోరాం. రాష్ట్ర పరిణామాలపై జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరాం’ అని తెలిపారు.