జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ  

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ‌ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ పాలకులను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేసిన సర్కారుకు హైకోర్టు కళ్లెం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది.

టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోల ఆధారంగా తదుపరి చర్యలన్నిటిపైనా స్టే విధించింది. అంతేగాక ఈ పిటిషన్లలో కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ పిటిషన్లలో కేంద్రం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చాలని అభ్యర్థిస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది.

న్యాయశాస్త్ర నిబంధనల మేరకు ఏ ప్రభుత్వమైనా అంతకుముందున్న ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. బలమైన, స్పష్టమైన కారణాలుంటేనే ఆ విధానాల నుంచి వైదొలగవచ్చని పేర్కొంది. కానీ ఈ కేసులో అలాంటిదేమీ కనిపించడం లేదని తెలిపింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వానికి చెందిన ప్రతి నిర్ణయాన్నీ పునఃసమీక్షించే విశృంఖలాధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, తమ ముందున్న రికార్డుల ప్రకారం పరిమితులకు లోబడి కొన్నింటిలో మాత్రమే సమీక్ష చేస్తున్నట్లుగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

పునఃసమీక్షాధికారం చట్టం ద్వారా పొందాలి తప్ప స్వతఃసిద్ధంగా రాదని కుండబద్దలు కొట్టింది. అలాంటి అధికారం తనకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారమూ చూపలేకపోయిందని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు చట్ట నిబంధనలు విరుద్ధంగా, ఏకపక్షంగా ఉన్నా సహేతుకంగా లేనిపక్షంలో న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొంది.

తమ ముందున్న వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలేవీ లేవని వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని,  కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చారని గుర్తుచేసింది.

అంతేగాక ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వంటివన్నీ లోపభూయిష్టమేనని పేర్కొంది. ఈ వ్యవహారంలో కేవలం దురభిప్రాయంతో రాష్ట్రప్రభుత్వం ఫిర్యాదు చేయడం, దర్యాప్తు చేయడం, అపరిమితమైన పునఃసమీక్షాధికారం కలిగి ఉన్నామనుకోవడం ఏమాత్రం సరి కాదని అభిప్రాయపడింది.

ఈ పిటిషన్ల వ్యవహారంలో ప్రజాస్వామ్యంలోని ముఖ్యాంశాలకు తగినట్లుగా ప్రభుత్వ చర్యలు లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది.

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం సమీక్షించజాలదని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

‘రాజ్యాంగం కేవలం ఉనికిలో ఉన్నంత మాత్రాన రాజ్యాంగ సంస్కృతి ఉన్నట్లు కాదు. రాజకీయ నాయకత్వం ప్రదర్శించే పరిపక్వత, సత్సంప్రదాయాల్ని అవలంబించే ప్రజలు ఉన్నచోట మాత్రమే రాజ్యాంగ సంస్కృతి పరిఢవిల్లుతుంది. అది లేనిచోట రాజ్యాంగ ప్రమాణాలు పుస్తకాలకే పరిమితమైన ఆదర్శాలుగా మిగిలిపోతాయి’ అని ఓ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు గుర్తు చేశారు.