హైకోర్టును ఆశ్రయించిన రకుల్

హైకోర్టును ఆశ్రయించిన రకుల్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ప్రచారాలను ఆపాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి నార్కొటిక్ అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పింది. 
తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందోని, వెంటనే ఆపాలంటూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్‌ చేసిందని పిటిషన్‌లో వివరించారు. అంతేకాకుండా తనపై అసత్యాలు ప్రచారం చేయకుండా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు సైతం ఆదేశాలు ఇవ్వాలంటూ కోరింది.
 
అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి రకుల్ పేరు సమాచార మాధ్యమాలలో మారుమోగుతుంది. తనపై వచ్చే ప్రసారాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. దానిపై స్పందించిన హైకోర్టు.. రకుల్ ప్రీత్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం తన వైఖరిని తెలపాలని కోరింది. రకుల్ అభ్యర్ధనను ప్రాతినిధ్యంగా భావించి.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, ప్రసార భారతి,  ప్రెస్ కౌన్సిల్‌ను హైకోర్టు కోరింది.